
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్
• రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు
• మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబుకానుంది. పిఠాపురం స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్లో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నారు.
గతంలో పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పరిశీలన సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో అశుభ్రత, దుర్గంధం ఉన్న విషయాన్ని గమనించి, వెంటనే శుభ్రపరచాలని అధికారులకు ఆదేశించారు.
జనవరిలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమై పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ప్రముఖ పట్టణమైన పిఠాపురానికి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్థం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు.
ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. స్టేషన్ భవనం, ముఖద్వారం, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో విశ్రాంతి గది, ఆధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పిఠాపురం అభివృద్ధికి మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.