
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్ల విద్యుత్ అందజేయనున్నాము. రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ధి చేకూరనుంది.
చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఉచిత విద్యుత్ పథకం చిన్న చేనేత కుటుంబాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి కొంత ఉపశమనం కలిగిస్తుంది. 2017లో నేతన్నలు కష్టాలను వ్యక్తం చేసినప్పుడు నా మనసు చలించిందని, వారి అండగా నిలవడం కోసం చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు.
నివార్ తుపాను కారణంగా వెంకటగిరి చేనేత మగ్గాలకు నష్టం జరిగినప్పుడు స్వయంగా వెళ్లి సమస్యలను చూసి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. ఉచిత విద్యుత్ పథకం అమలు కూటమి భాగస్వామ్యపక్షంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని, గడచిన 21 నెలల కాలంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ముందుకు తీసుకువెళ్తోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ప్రతి చేనేత కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.