

* పేదింటి ఆడపిల్లలకు చదువుపై శ్రద్ధ
* కేజీబీవీ పాఠశాలల ద్వారా మెరుగైన విద్య
* కోట్ల రూపాయల ఖర్చుతో వసతుల కల్పన
* 352 విద్యాలయాల్లో లక్ష మంది అమ్మాయిల విద్యాభ్యాసం
అవి కేవలం పాఠశాలలు కావు…
పేద బాలికల కలలు సాకారం చేసే విద్యా సంస్థలు…
చదువుకు ఆస్కారం లేని ఆడపిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే సరస్వతీ నిలయాలు…
అవే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు.
వీటి ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, శ్రద్ద వల్ల ఈ పాఠశాలలు ఇప్పుడు మునపటి కన్నా సౌకర్యాలతో, పటిష్టమైన విద్యా ప్రణాళికతో బాలికల విద్యకు భరోసా కల్పిస్తున్నాయి.
ముఖ్యంగా వేర్వేరు కారణాలతో పాఠశాల మానేసిన, అట్టడుగు వర్గాలకు చెందిన బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా వీటిని ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి , ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ విద్యాసంస్థల స్థితిగతుల గురించి ప్రస్తావించుకోవడం సముచితం.
వీటిలో అనాథలు, బడి బయట పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల బాలికలకు 75 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. అమ్మాయిల చదువులు మధ్యలో ఆగిపోకుండా వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను కూటమి ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఒకప్పుడు 53 విద్యాలయాలతో ప్రారంభమైన ఇవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది బాలికల భవిష్యత్తుకు నీడనిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీల్లో 1.07 లక్షల మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత వసతి, చదువు అందిస్తున్నారు. వీటిలో సీట్లకు భారీ డిమాండ్ ఉంది. గతేడాది ఆరో తరగతిలో 14,080 సీట్లు ఉండగా.. 35,672 దరఖాస్తులు వచ్చాయి.
* మహిళా అక్షరాస్యత కోసం..
మహిళా అక్షరాస్యత 46.13 శాతం కంటే తక్కువ ఉన్న వెనుకబడిన బ్లాకుల్లో కేంద్ర సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. 2025-26 సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.352 కోట్లు కేటాయించాయి. చదువు మధ్యలో మానేసినవారు, అసలు బడికి వెళ్లనివారు, అనాథలు, తల్లి లేదా తండ్రి లేనివారు, 40 శాతం వైకల్యం ఉన్న విద్యార్థినులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పలు సౌకర్యాలతో కూడిన వసతి కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిలో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. చదువులోనూ విద్యార్థినులు రాణిస్తున్నారు. 2024-25లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో 83.45% మంది ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్మీడియట్‌లో 87.95% మంది పాసయ్యారు.
* నైపుణ్యాలకు పదును
పేద విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు వృత్తివిద్యా కోర్సులు, వ్యక్తిగత అభ్యసన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. డిజిటల్ పరికరాలైన ట్యాబ్‌ల ద్వారా నేర్చుకునేలా పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పాల్) విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు ట్యాబ్‌లో పాఠం విన్నాక కొన్ని ప్రశ్నలు వస్తాయి. వీటికి ఇచ్చే సమాధానాల ఆధారంగా వారు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. దీనికి అనుగుణంగా వారిని పైస్థాయికి తీసుకెళ్లేందుకు వీడియో పాఠాలు ట్యాబ్ లో వస్తాయి. చదువుతో పాటు ఉపాధి నైపుణ్యాల కోసం 44 విద్యాలయాల్లో వృత్తివిద్యా కోర్సులను అమలు చేస్తున్నారు.
* సదుపాయాలు ఇలా..
250 కేజీబీవీల్లో సౌర విద్యుత్తు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యుత్తు, సౌర గీజర్లతో విద్యార్థినులకు వేడినీళ్లు అందిస్తున్నారు.
వంటల కోసం రిఫ్రిజిరేటర్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఉన్నాయి. విద్యార్థినులకు ఇటీవల పరుపులను పంపిణీ చేశారు. అమ్మాయిల భద్రత కోసం ఒక్కో విద్యాసంస్థలో తొమ్మిది చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కరాటే నేర్పిస్తున్నారు. మెంటల్ హెల్త్ కౌన్సెలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
2024-25లో 342 బోధన, 1,146 బోధనేతర పోస్టులు భర్తీ చేశారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఏర్పాటు చేసి, బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా విద్యార్థినులకు ఉచిత వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీలను బలోపేతం చేస్తున్నారు.
* ఆరోగ్యం మరియు భద్రత…
ఈ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏఎన్ఎంల నియామకం, సిసిటివి కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నారు.