
అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు, పడిపోతున్న కరెన్సీ విలువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్కు ఈ పరిస్థితి మరింత సంక్షోభాన్ని తీసుకొచ్చింది.
హర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్కు 112 డాలర్లకు పైగా చేరాయి. దీంతో రవాణా, బీమా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఫలితంగా పాకిస్థాన్ వారపు పెట్రోలియం దిగుమతి ఖర్చు 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ పెరుగుదలతో ఏటా అదనంగా సుమారు 26 బిలియన్ డాలర్ల భారం పడుతోంది. ఇది పాకిస్థాన్ వార్షిక ఎగుమతి ఆదాయం (సుమారు 29.8 బిలియన్ డాలర్లు)తో దాదాపు సమానంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే, దేశం సంపాదించిన దాదాపు మొత్తం ఆదాయం చమురు దిగుమతులకే ఖర్చవుతోంది.
పాకిస్థాన్ తన చమురు అవసరాల్లో 85–90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు లేకపోవడం, వ్యూహాత్మక నిల్వలు లేకపోవడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రమైంది చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు దాని ప్రభావం నేరుగా ఇంధన ధరలు, రవాణా ఛార్జీలు, విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోంది. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం, చమురు ధరలు 10 శాతం పెరిగితే పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం 0.4 నుంచి 0.6 శాతం వరకు పెరుగుతుంది.
ఈ పరిస్థితులు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.