
రాజోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.3.70 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు ఆర్‌అండ్‌బీ రహదారులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ ప్రారంభించారు. గుబ్బలపాలెం కోళ్లవారి సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రహదారులను ప్రజలకు అంకితం చేశారు.
ఈ పనుల్లో భాగంగా రూ.1.65 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 2.65 కిలోమీటర్ల మలికిపురం సబ్‌స్టేషన్ రోడ్డు, రూ.2.05 కోట్ల వ్యయంతో నిర్మించిన 3.55 కిలోమీటర్ల గూడపల్లి–గుబ్బలపాలెం రహదారులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, మెరుగైన రహదారులు ప్రజల రాకపోకలకు సౌలభ్యాన్ని కల్పించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. రాజోలు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.