

ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దని శ్రీ పవన్ కళ్యాణ్ కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన
• శ్రీ పవన్ కళ్యాణ్ కుటుంబంతో ఆప్యాయంగా ముచ్చటించిన ప్రధానమంత్రి
• మార్క్ శంకర్ సొంతంగా రూపొందించి అందించిన వెల్కమ్, థాంక్యూ కార్డులు చూసి ముచ్చటపడ్డ శ్రీ మోదీ
• ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ కవిత వినిపించిన అకీరా నందన్
• ఆద్య, పలీనా అంజని చదువుల గురించి అడిగిన శ్రీ మోదీ జీ
• శ్రీమతి అన్నా కొణిదెలతో సంభాషణాల్లో రష్యన్ పదాలు పలికిన ప్రధాన మంత్రి
‘ఎవరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే మీరు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహిస్తూ శ్రద్ధ చూపించాలి’ అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హితవు చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ సభ్యులు హార్ధిక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి, శస్త్ర చికిత్స గురించి వాకబు చేసి పరామర్శించారు. గత కొన్నేళ్లుగా సాగించిన పర్యటనల్లో దుమ్ము ధూళి రేగిపోయి – సైనస్ లోకి చేరిపోయి ఒక చిన్నపాటి గట్టి బాల్ మాదిరిగా మారిపోయి తీవ్ర ఇబ్బంది కలిగించి ఇన్ఫెక్షన్ అయిందని, కంటిపైనా ప్రభావం చూపిందని… ఆ క్రమంలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫేస్) చేశారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని శ్రీ మోదీ గారు అడిగారు. భుజాల దగ్గర మజిల్ కి గతంలో తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అని వైద్యులు తెలిపారని, వాటికి సర్జరీలు చేయాల్సి ఉందని, స్పైనల్ కార్డ్ కి సంబంధించి సమస్య ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారు హితవు చెబుతూ ‘ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. మీరు ఈ సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంది’ అని పలు సూచనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ కొన్ని రష్యన్ పదాలు పలికారు. ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ సందర్భంగా తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థాంక్యూ కార్డులను శ్రీ మోదీ గారికి అందించారు. మార్క్ శంకర్ ను దగ్గరకు తీసుకొని ‘నీ గురించి మేమందరం ఎంతో కంగారు పడ్డాము. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని సింగపూర్ లో నువ్వు ఎలా ఉన్నావో అని మేమంతా ఆందోళనపడి, నీ గురించే ఆలోచించేలా చేశావు కదరా బాబూ’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు.
• కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు
అకీరా నందన్ తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని అడిగారు. ప్రస్తుతం మార్షన్ ఆర్ట్స్ నేర్చుకొంటున్నాను, అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నాను అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు… నువ్వూ అటు వైపే వెళ్తున్నావా అని చమత్కరించారు. ఈ సందర్భంగా- ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ కవితను వినిపించి, అందుకు సంబంధించి వివరాలను అకీరా నందన్ వినిపించారు. ఆ కవితకు ముగ్ధుడైన శ్రీ మోదీ గారు రాంధారీ సింగ్ దినకర్ జీ ఎంతో కఠినమైన హిందీ భాషను రాశారు.. కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు అని చెప్పి అభినందించారు. ఆద్య కొణిదెల ఏమి చదువుతున్నారో అడిగారు. ఈ సందర్భంగా ఆద్య – తన అమ్మమ్మ గారి వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని చెప్పారు. ఆద్యతో కూడా శ్రీ మోదీ గారు హిందీలో మాట్లాడారు. చిన్న కుమార్తె పలీనా అంజని ఇంగ్లీష్ లో మాట్లాడారు. హిందీ వచ్చా అని శ్రీ మోదీ గారు అడిగారు. తనకు హిందీ రాదు అని పలీనా తెలిపారు. ఈ సందర్భంగా పలీనా, శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి అని సరదాగా చెప్పారు. సుమారు 20 నిమిషాలపాటు శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. అనంతరం శ్రీ మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసింది. ‘మీరు మా ఇంటికి వచ్చి చూపించిన అప్యాయతను, ప్రేమపూర్వక సంభాషణలను ఎప్పటికీ మరచిపోలేము’ అని ఇంటిల్లిపాదీ శ్రీ మోదీ గారికి చెప్పారు.