
పిఠాపురం: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద రిక్షా కార్మికుడి కుటుంబానికి జనతా ఫౌండేషన్ ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది.
పిఠాపురం టౌన్‌లోని కత్తులగూడెం గ్రామానికి చెందిన గోకివాడ రాంబాబు వృత్తిరీత్యా రిక్షా నడుపుతూ భార్యాపిల్లలను పోషించుకుంటున్నారు. అయితే కొంతకాలంగా లిపోసార్కోమా సంబంధిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత కారణంగా పనికి వెళ్లలేకపోవడంతో కుటుంబానికి ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితిలో కుటుంబం చిక్కుకుంది.
ఈ విషయాన్ని స్థానికుడు తమ్ముడు లోకేష్ జనతా ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఫౌండేషన్ అధినేత జమ్మూ వెంటనే స్పందించి, బాధితుడి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు ఫౌండేషన్ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు అవసరమైన సమయంలో సహాయం అందించడమే జనతా ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మానవత్వంతో స్పందించి సేవా కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో ఎన్.ఆర్.ఐ సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, చెక్కపల్లి వినయ్, ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.