
పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని భద్రతా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జెడ్ కేటగిరీ భద్రత కలిగిన నేతగా ఉన్నప్పటికీ, ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తూ కాన్వాయ్ కుదింపునకు ఉప ముఖ్యమంత్రి ముందుకొచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలో పొదుపు చర్యలు అమలు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆదేశాల మేరకు గురువారం ఉదయం నుంచే కాన్వాయ్‌లో మార్పులు అమల్లోకి వచ్చాయి. అనవసర వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఇంధన ఆదా చేయడంతో పాటు ప్రజాధనం వృథా కాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.