వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోండి

* ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి సూచించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
శస్త్ర చికిత్స చేయించుకున్న క్రమంలో వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు స్వాగతం పలికారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు.
*శస్త్ర చికిత్స వివరాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సైనస్ సంబంధిత ఇబ్బందిగా భావించినా- అది తీవ్ర సమస్యగా పరిణమించిందని, ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో శస్త్ర చికిత్స చేశారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇప్పటికీ కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ ఉన్నదని, మరో వారం రోజులలో సర్దుకుంటుందని డాక్టర్లు తెలిపారన్నారు. అదే విధంగా సినిమాలకి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలలో తగిలిన గాయాలను అప్పట్లో పట్టించుకోలేదని అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయని వివరించారు. భుజం దగ్గరి మజిల్ కి గాయాలు గత అయిదేళ్ల నుంచి ఉన్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని వైద్యులు ఈ సందర్భంగా వివరించారు. ఆ సమయం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యంపై పూర్తి శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పుడు తిరగబెడుతున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, శస్త్ర చికిత్స అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యులు తెలిపిన సూచనలు పాటించడం తప్పనిసరి అని చెప్పారు. తగిన విశ్రాంతి తీసుకొని, పూర్తి స్వస్థత పొందాలని ఆకాంక్షించారు. శస్త్ర చికిత్స అనంతరం శాఖాపరమైన రివ్యూలు చేయడం, ఫైల్స్ పరిశీలించడాన్ని ప్రస్తావిస్తూ- నిర్దేశిత సమయంలోనే ఆ విధులు నిర్వర్తించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.