జి.జి హెచ్ వైద్య బృందానికి కలెక్టర్ రాజాబాబు అభినందనలు

ఒంగోలు: మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలోని, బాధితులకు పూర్తి స్థాయిలో, సకాలంలో వైద్యం అందించిన జి జి హెచ్ వైద్య బృందం మరియు సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాజాబాబు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. క్యాజువాలిటీకి వచ్చిన నాటి నుంచే వైద్యులు బాధితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని జిల్లా రెవెన్యూ అధికారి బి. చిన ఓబులేసు తెలిపారు.

మార్చి 26న జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన 17 మంది జి జి హెచ్‌లో చేరగా, వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ ప్రమాద స్థలం నుంచే పరిస్థితిని పర్యవేక్షించగా, జాయింట్ కలెక్టర్ కూడా వైద్య సేవల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. సూపరింటెండెంట్, విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఒక్క మరణం కూడా లేకుండా చికిత్స అందించారు.

ఒక బాధితుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జి జి హెచ్‌కు తరలించగా, అతను పూర్తిగా కోలుకున్నాడు. అందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ మరియు వైద్యులను పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రమాద బాధితుల చికిత్సలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, డా. ఉగ్ర నరసింహ రెడ్డి, ఇంటూరి నాగేశ్వర రావు, బి.ఎన్. విజయ్ కుమార్, ఓడా చైర్మన్ రియాజ్ తదితరులు చొరవ చూపారని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వైద్య సేవలపై నిరంతరం సమీక్ష చేసినట్లు వెల్లడించారు.

తీవ్ర గాయాలతో ఉన్న వారికి తొలి రోజే శస్త్రచికిత్సలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందించబడింది.

సూపరింటెండెంట్ మాణిక్యరావు మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతంగా నిర్వహించడం జి జి హెచ్ బృందం నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇలాంటి చికిత్సకు భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. జిల్లా అధికారుల సమన్వయంతో సేవలు సమర్థవంతంగా జరిగాయని తెలిపారు.

ఈ సమావేశంలో సి ఎస్ ఆర్ ఎమ్ మాధవిలత, అడ్మినిస్ట్రేటర్ అద్దెయ్య, డి ఎం హెచ్ ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.