
నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..ఎమర్జెన్సీ వార్డుల్లో స్వయంగా పరిశీలన..వైద్యసేవలపై ఆరా.. వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం
నిడదవోలు నియోజకవర్గంపై పక్కా నిఘా..ప్రజా సమస్యల పరిష్కారంలో నో కాంప్రమైజ్..రాత్రైనా పగలైనా సమస్య తెలిసిన మరుక్షణమే ఆసుపత్రి బాట పట్టిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: అసెంబ్లీ వేదికైనా, నియోజకవర్గ ప్రజా సమస్యలైనా మంత్రి దుర్గేష్ ప్రాధాన్యం ప్రజారోగ్యమే అని మరోసారి నిరూపితమైంది.. గత రెండు మూడు రోజులుగా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో, పత్రికల్లో నిడదవోలు ప్రభుత్వాసుపత్రి సేవలపై వస్తున్న వార్తలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీలో భాగంగా మంత్రి దుర్గేష్ ఎమర్జెన్సీ, జనరల్ వార్డులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి అంతా కలియతిరిగి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటు, మందుల నాణ్యత గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేద ప్రజలే ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తారని, వారికి సక్రమంగా వైద్యం అందించాల్సిన పూర్తి బాధ్యత వైద్య యంత్రాంగానిదేనని గుర్తుచేశారు.రాత్రి సమయంలో ఆసుపత్రిలో తప్పనిసరిగా ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఆసుపత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యపరమైన ఫిర్యాదులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు సేవ చేయడానికి ఇష్టం లేనివారు బయటకు వెళ్లిపోవచ్చని ఘాటుగా తెలిపారు.నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి నేరుగా రాత్రి వేళల్లో ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ చొరవపై స్థానిక ప్రజలు, రోగులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.