బెంగళూరు: భారతీయ వస్త్రాలు, చేనేత, సాంప్రదాయ హస్తకళలకు ప్రపంచ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కీలక అడుగు పడింది. బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక ఎఫ్‌కేసీసీఐ, దుబాయ్ చాంబర్ అవగాహన ఒప్పందం కార్యక్రమంలో భారతీయ చేనేత, వస్త్రాలు, సాంప్రదాయ హస్తకళలకు ప్రాతినిధ్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షురాలు ఉమా రెడ్డి, దుబాయ్ చాంబర్స్ అధ్యక్షుడు, సీఈఓ మహమ్మద్ అలీ రాషెద్ లూతా తదితర ప్రముఖ ప్రతినిధులతో భారతీయ కళాకారులు, చేనేత రంగం, హస్తకళల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.
భారతీయ సంప్రదాయ కళలకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావడం, కళాకారులకు కొత్త వాణిజ్య అవకాశాలు కల్పించడం, దుబాయ్‌తో బలమైన వాణిజ్య మార్గాలను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యాలుగా చర్చించారు. అలాగే ప్రపంచ స్థాయి ప్రదర్శనలు, మార్కెటింగ్ వేదికలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని ప్రతినిధులు వివరించారు.
తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, స్టార్టప్‌లకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సాంప్రదాయ హస్తకళలను ఆధునిక ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా వారసత్వ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ప్రతినిధులు పేర్కొన్నారు.
భారతీయ కళలు, చేనేత, హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెంచేందుకు వాణిజ్య భాగస్వామ్యాలు, మార్కెటింగ్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలకమని తెలిపారు. స్థానిక కళాకారుల ప్రతిభను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు ఇలాంటి భాగస్వామ్యాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కీలక భాగస్వామ్యాన్ని సులభతరం చేసిన ఎఫ్‌కేసీసీఐ, దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సుస్థిర వృద్ధి, ప్రపంచ వాణిజ్యం, సరిహద్దులు దాటి ఆవిష్కరణలకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షురాలు ఉమా రెడ్డి, దుబాయ్ చాంబర్స్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, దుబాయ్ చాంబర్స్ సీఈఓ రషీద్ లూతా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ టి. సాయిరాం ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బీపీ శశిధర్, ఎంజీ బాలకృష్ణ, గ్లోబల్ బీ2బీ కమిటీ చైర్పర్సన్, సుష్మ విద్యా రత్నరాజ్, డీఏ తేజేశ్వరి, చిత్తూరు జిల్లా సీనియర్ జనసేన నాయకురాలు డీకే చైతన్య ఆదికేశవులు తదితరులు పాల్గొన్నారు.