

రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్ షాప్ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల అధికార ప్రతినిధులు, ఔత్సాహిక జనసేన నాయకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజువారీ మీడియాలో ప్రజా సమస్యలు, రాష్ట్ర మరియు జాతీయ రాజకీయ అంశాలపై జరుగుతున్న చర్చల్లో జనసేన పార్టీ తరఫున బలమైన, బాధ్యతాయుతంగా గళం వినిపించేందుకు, చర్చలను అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు విజయవాడలో రెండు రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్ నిర్వహించారు. సమకాలీన అంశాలపై లోతైన అవగాహన పొందడంతో పాటు, మీడియా చర్చల్లో సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారు, గౌరవ MLC మరియు ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే పలువురు మేధావులు, సీనియర్ పాత్రికేయులు, పాల్గొని పార్టీ ప్రతినిధులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ వర్క్ షాప్ అనంతరం ఎంపిక చేసిన వారికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు అధికార ప్రతినిధులుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. అధికార ప్రతినిధులుగా నియామకం అయిన వారు, ఇక నుండి మీడియాలో బాధ్యతాయుతంగా, జనసేన పార్టీ తరపున ప్రజలకు ఉపయోగపడే అర్థవంతమైన మీడియా చర్చల్లో పాల్గొని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, జనసేన పార్టీ భావజాలం, ప్రభుత్వం తరపున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేయాలని సూచించారు.