2027 గోదావరి పుష్కరాలకు కుంభమేళా తరహా ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్

  1. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
  2. 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా – భద్రతకు అగ్రతాంబూలం
  3. త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని మంత్రి దుర్గేష్ వెల్లడి
  4. నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వివరాలు వెల్లడించిన మంత్రి దుర్గేష్

అమరావతి/ మంగళగిరి: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి వివరాలపై సమీక్షించారన్నారు.. అదే విధంగా గోదావరి పుష్కరాల నిర్వహణపై దిశానిర్దేశం చేసినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు మంత్రి దుర్గేష్ చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా ఉత్సవానికి సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశామని, భక్తుల సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట వేయాలని భావించినట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

భక్తుల కోసం ప్రత్యేక వసతులు, మంచినీరు, పారిశుద్ధ్యం మరియు విశ్రాంతి గదుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కోట్లాదిగా తరలివచ్చే భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

పుష్కర ఏర్పాట్లపై త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ భేటీలో క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. రాష్ట్ర గౌరవం ఇనుమడించేలా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ గోదావరి పుష్కరాలను నిర్వహించబోతోందని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ ద్వారా పలు పనులు చేపట్టినట్లు, వాటి పురోగతిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించినట్లు మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలో నిడదవోలు అభివృద్ధికి సహకరిస్తున్నందుకు డిప్యూటీ సీఎం కి మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.