
నంద్యాల : జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.
నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలోని 28 మంది సభ్యుల బృందం నంద్యాలలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నాయకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టి జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు సేకరిస్తున్నామని తెలిపారు.
సేకరించిన దరఖాస్తులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిశీలనకు పంపనున్నట్లు వెల్లడించారు. అర్హత, నిబద్ధత, పార్టీ కోసం చేసిన సేవల ఆధారంగా పార్టీ బాధ్యతల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.