

తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, వాటి వంశవృద్ధికి కీలకమైన అడుగు పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తూర్పు కనుమల్లో పులుల్లో తలెత్తుతున్న ఇన్-బ్రీడింగ్ సమస్యను అధిగమించే అంశంపై ఇరువురు చర్చించారు.
ఈ సమస్య పరిష్కారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయం పులుల జన్యు వైవిధ్యాన్ని పెంచడంతో పాటు వాటి సంరక్షణకు మరింత తోడ్పడుతుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా సహకారం అందించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తూర్పు కనుమల్లో పులుల పరిరక్షణకు, పర్యావరణ సమతుల్యతకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.