
అమలాపురం: దివ్యాంగులు రవాణా శాఖ సేవలను నేరుగా, సులభంగా పొందేందుకు మొబైల్ వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు.
మూడు చక్రాల మోటార్ సైకిళ్లు కలిగిన దివ్యాంగులు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ కోసం 92816 07021 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ తదితర రవాణా శాఖ సేవలకు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
గత నెల రోజుల్లో 16 మంది దివ్యాంగులు మూడు చక్రాల స్కూటర్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు లెర్నింగ్ లైసెన్స్‌లు పొందారని డీటీఓ వెల్లడించారు.
దివ్యాంగులకు రవాణా శాఖ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ వాట్సాప్ సదుపాయం ఉపయోగపడుతుందని తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవిశెట్టి శ్రీనివాసరావు కోరారు.