
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం పునరావాస లే-అవుట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మార్కాపురం మండల పరిధిలోని వేములకోట, ఇడుపూర్-1, ఇడుపూర్-2, గోగులదిన్నె పునరావాస కాలనీలతో పాటు పెద్దారవీడు మండలంలోని తోకపల్లి, దేవరాజుగట్టు లే-అవుట్లలో జరుగుతున్న పనులను అధికారులు పరిశీలించారు. తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, విద్యుదీకరణ, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు.
ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత గడువులోగా అన్ని మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పునరావాస కాలనీల్లో మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పునరావాస పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ క్షేత్రస్థాయి తనిఖీలో మార్కాపురం ఆర్డీవో బి. వెంకట శివరామిరెడ్డి, వెలిగొండ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ అబుతాలిం తదితర అధికారులు పాల్గొన్నారు.