
విజయవాడ: కాపు, బలిజ, తూర్పుకాపు, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల హక్కులు, అభివృద్ధి కోసం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రేటర్ రాయలసీమ కాపు–బలిజ సంఘం నేత పూల పాండురంగయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్ కాపునాడు, కాపు జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కాపు సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని పూల పాండురంగయ్య ఆరోపించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కాపు, బలిజ, తూర్పుకాపు, తెలగ, ఒంటరి వర్గాల నుంచి విస్తృత మద్దతు లభించిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సామాజిక వర్గాల అభ్యున్నతికి మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపు, బలిజలకు ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాపు కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం రూ.3,000 కోట్ల నిధులు కేటాయించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు–బలిజ భవనాల నిర్మాణాలను పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కాపు విద్యార్థుల పెండింగ్ బకాయిలను చెల్లించడంతో పాటు అమరావతిలో కాపు భవనం కోసం 5 ఎకరాలు, పేద విద్యార్థుల కమ్యూనిటీ హాస్టల్ కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని సూచించారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ నియామకాల్లో కాపు–బలిజ సామాజిక వర్గానికి చెందిన అర్హులైన ప్రొఫెసర్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలని పూల పాండురంగయ్య కోరారు. ముఖ్యంగా ఒక మహిళా ప్రొఫెసర్‌కు కూడా వైస్‌ఛాన్సలర్‌గా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాపు, బలిజ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తిస్తూ అమరావతిలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాలకు కాపు ప్రముఖుల పేర్లు పెట్టాలని కోరారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి తదితర అంశాల్లో కాపు–బలిజ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని కాపు, బలిజ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని పూల పాండురంగయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన కాపు, బలిజ, తూర్పుకాపు, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల నాయకులు, మేధావులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.