
ఏలూరు : శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై ప్రవల్లిక పట్ల కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు దురుసుగా వ్యవహరించిన ఘటనను ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్, ఏలూరు జనసేన ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టాన్ని అమలు చేస్తున్న మహిళా పోలీసు అధికారిణిపై అనుచితంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవం లేని తీరుకు ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు.
నేరాలకు పాల్పడిన వారిని ప్రోత్సహించే రాజకీయ సంస్కృతి వైసీపీలో పెరిగిందని ఆరోపించిన ఆయన, మహిళా ఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అన్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ నాయకుల్లో అహంకార ధోరణి తగ్గలేదని విమర్శించిన రెడ్డి అప్పలనాయుడు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారుల భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని, ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.