
ఆంధ్రప్రదేశ్ హస్తకళల పరిరక్షణ, ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026ను ప్రారంభించిన ఆయన, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో రాష్ట్రంలో హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
హస్తకళలను రూపొందించే కళాకారులకు సరైన గుర్తింపు దక్కేలా ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, అందులో కళాకారుడి వివరాలు, కళాఖండం విశేషాలను పొందుపరుస్తామని తెలిపారు. కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వీబీ జీ రాం జీ పథకం కింద హస్తకళల క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, కళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాటకు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మహోత్సవంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్తకళాకారుల స్టాళ్లను పవన్ కళ్యాణ్ సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ జాందానీ చీరలను అన్నా కొణిదల కోసం కొనుగోలు చేయగా, అరటి పీచుతో తయారైన ఉత్పత్తులు, తిరుపతి చెక్క బొమ్మలు, శ్రీకాళహస్తి, పెడన కలంకారీ, నరసాపురం లేస్, సవర కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించారు. కళాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా లేపాక్షి ఈ-కామర్స్ యాప్‌ను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్, గుంటూరు, కాకినాడలో పునరుద్ధరించిన లేపాక్షి షోరూమ్‌లు, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.