నందిగామలో జనసేన సమాచార సేకరణపై మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం

నందిగామ : జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు సముచిత గుర్తింపు కల్పించడమే పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు కందుల దుర్గేష్ అన్నారు.

నందిగామ పట్టణంలోని బాబు జగజీవన్‌రావు భవన్‌లో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు కార్యక్రమం ఉద్దేశం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రధాన పరిశీలకులను నియమించి, ప్రతి పార్లమెంట్ పరిధిలో 32 మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన పరిశీలకుడితో పాటు కమిటీ సభ్యులు, పార్టీ ప్రతినిధులు కలిసి పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తున్నారని చెప్పారు.

విజయవాడ, జగ్గయ్యపేటలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన లభించిందని పేర్కొన్న ఆయన, పార్టీ ఆవిర్భావం నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన ప్రతి జనసైనికుడికి ఈ ప్రక్రియ ద్వారా తగిన అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. నాయకత్వ లక్షణాలు, రాజకీయ అవగాహన, సామాజిక స్పృహ, పార్టీ పట్ల నిబద్ధత, ప్రజాసేవను ప్రామాణికంగా తీసుకుని దరఖాస్తులను పరిశీలిస్తామని, తుది నిర్ణయం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకుంటారని వెల్లడించారు.

జనసైనికులు తమ సామర్థ్యానికి అనుగుణంగా పదవులను స్వయంగా ఎంపిక చేసుకునే ప్రజాస్వామ్య అవకాశాన్ని పార్టీ కల్పించిందని తెలిపారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని కొనియాడిన మంత్రి, పార్టీ పట్ల అంకితభావం, నాయకుడిపై విశ్వాసం ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తుండటం కూడా అదే విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరిన్ని రాజకీయ అవకాశాలు రానున్నాయని, అందువల్ల నాయకులు, కార్యకర్తలు ఈ సమాచార సేకరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాత జనసేన మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ప్రతినిధులు, జనసైనికులు, వీర మహిళలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు నందిగామకు చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్‌కు స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.