
అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలోని చొంపి గ్రామంలో చేపట్టిన జల్ సించాయ్ జన భాగీదారి 2.0 కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న వాటర్ కన్జర్వేషన్ పనులను ఎమ్మెల్సీ కె. నాగబాబు మంగళవారం పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అధికారులతో కలిసి కండిత కందకాలు, ప్లాంటేషన్, ఫాం పాండ్స్ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
పనుల నాణ్యత, కండిత కందకాల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన నాగబాబు, నీటి సంరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10.49 లక్షలు, మన్యం జిల్లాలో 10.11 లక్షలు కలిపి అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 20 లక్షలకు పైగా కండిత కందకాలు విజయవంతంగా పూర్తి చేయడం దేశంలోనే ప్రథమ స్థానాన్ని తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి ఎద్దడిని తగ్గించడం, మట్టికోతను నివారించడం వంటి శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని నాగబాబు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారులు, సాంకేతిక సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.