


ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే శక్తివంతమైన వ్యవస్థగా పంచాయతీరాజ్ శాఖ మారాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఓఎస్డీ కఠారి వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వంలో విజన్ లోపం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, గ్రామ సభల నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు బలహీనపడ్డాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను తిరిగి బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని, గత రెండేళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాలకు నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ చేసినట్లు తెలిపారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను సమర్థంగా నడిపించడంలో కఠారి వెంకటకృష్ణ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం, సంస్కరణలు ప్రభుత్వ వ్యవస్థలకు దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన సేవలను మరో మూడేళ్లు కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలంటే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కోసం ఉద్యోగులు ఒక అడుగు ముందుకు వేస్తే, వారి కోసం ప్రభుత్వం వంద అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు, శిక్షణలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చామని, గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖలో 10 వేలకుపైగా ప్రమోషన్లు కల్పించామని తెలిపారు. దశాబ్దాలుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న 77 మంది అధికారులకు జెడ్పీ సీఈవోలుగా పదోన్నతులు ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రజలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పనిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గత ప్రభుత్వంలో ఆక్రమణలకు గురైన గ్రేజింగ్ ల్యాండ్స్, కమ్యూనిటీ ల్యాండ్స్, చెరువులు, ఇతర ప్రభుత్వ భూములను రక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న సమస్యల కోసం ప్రజలు సీఎం, డిప్యూటీ సీఎం వరకు రావాల్సి రావడం క్షేత్రస్థాయి పాలన వైఫల్యమని పేర్కొంటూ, గ్రామ, మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.