ఇంటర్ తర్వాత ఉన్నత విద్యపై అవగాహన అవసరం: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్–2026ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సోమవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పూర్తైన తర్వాత దేశ, విదేశాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు విద్యార్థులు తమ భవిష్యత్‌కు సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

విద్యార్థులు అకడమిక్ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా మెరుగుపరుచుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ బ్రిలియంట్ సంస్థ నిర్వహించిన ఈ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రకాశం జిల్లా విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విశ్రాంత డీజీపీ కె.ఆర్‌.ఎం. కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ అనంతరం విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని, అందువల్ల సరైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఈ మెగా ఫెయిర్‌లో కేఎల్, విజ్ఞాన్, విఐటీ, ఐఎస్‌ఎఫ్‌వై, జీజీయూ తదితర ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు 25కిపైగా విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొని కోర్సులు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. సుమారు 2,000 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ల్యాప్‌టాప్ లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేయగా, ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 950కు పైగా మార్కులు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ‘ప్రైడ్ ఆఫ్ ప్రకాశం’ మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డా. ఎస్‌.కె. న్యామత్, మేనేజింగ్ డైరెక్టర్ తొహారా, డైరెక్టర్ అఖిల్, కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, ఈవెంట్ మేనేజర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.