
కర్ణాటకలోని ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి రూ.200 కోట్లతో కుట్ర జరిగిందని, అందులో తనకూ పాత్ర ఉందంటూ ముసుగు ధరించిన చిన్నయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.
బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్, ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై తనకు ముందస్తు సమాచారం కూడా లేదని, తన పేరును కావాలనే వివాదంలోకి లాగుతున్నారని అన్నారు.
సామాజిక కార్యకర్త గిరీశ్ మట్టన్నవర్ తనను సంప్రదించి, చిన్నయ్య అనే వ్యక్తి తనతో మాట్లాడాలని కోరుతున్నట్లు తెలిపారని వెల్లడించారు. తమిళంలో మాట్లాడిన ఆ వ్యక్తి తనను కలవాలని కోరగా తాను నిరాకరించినట్లు చెప్పారు. అనంతరం అతను పంపిన వాయిస్ మెసేజ్‌ను సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతికి పంపి, ఒక బాధ్యతాయుత పౌరుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని వివరించారు.
ధర్మస్థల ఆలయ ప్రతిష్టను భంగపరచడానికి కేరళ నుంచి రూ.200 కోట్లు అందాయని, ఆ కుట్రలో ప్రకాశ్ రాజ్ భాగస్వామిగా ఉన్నారని ఆరోపిస్తూ చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్, ఆధారాలు లేకుండా తన పేరును వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషన్‌లో పేరు ఉన్నంత మాత్రాన ఎవరినీ దోషులుగా పరిగణించలేమని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, సిట్ తన దర్యాప్తు నివేదికను జూన్ 29న హైకోర్టుకు సమర్పించనుంది.