
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తానని చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాకుండా, రాజకీయంగా ఒంటరిగా వస్తారా లేదా పొత్తులతో వస్తారా అనే విషయాన్ని ముందుగా చెప్పాలని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్, సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్‌పై విమర్శలు గుప్పించారు. “ప్రతి అంశంలో జోక్యం చేసుకోవడం ఎందుకు? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి?” అంటూ ప్రశ్నించారు.
అంతేకాకుండా, ప్రతి విషయంలో తీర్పులు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేదా దేశ ప్రధానివా అంటూ విమర్శించారు. ఎక్కడ చూసినా, ఏ అంశం వచ్చినా స్పందించడం మానుకుని ముందు తన గురించి తెలుసుకోవాలని, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయాలని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు.
ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో చోటుచేసుకున్న ఈ వ్యాఖ్యల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారగా, రాజకీయ మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.