జనవాణిలో రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ సమస్యపై ఫిర్యాదు

డంపింగ్ యార్డ్ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ కాలుష్య సమస్య ప్రధాన అంశంగా ప్రస్తావనకు వచ్చింది. ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ కాలుష్య బాధితులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్ర కాలుష్యం ఏర్పడి స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు వివరించారు. డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.

వినతిపత్రం స్వీకరించిన విజయకుమార్ వెంటనే జెడ్పీ సీఈఓ నాగమణి, ఎంపీడీఓ రమణయ్యలతో ఫోన్‌లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి శరవణన్, పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులకు కూడా వినతిపత్రాలు సమర్పించారు. సంబంధిత అధికారులు సమస్యపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజన్న కాలనీ వాసులు మొగ్గ ప్రశాంత్, గోపి, సత్తిబాబు, అఖిల్ తదితర కాలుష్య బాధితులు పాల్గొని తమ సమస్యలను వివరించారు. స్థానిక ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.