తాళ్లపాలెం మావుళ్లమ్మ జాతర మహోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనడం విశేషం

డదవోలు : నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జాతర మహోత్సవాలకు విచ్చేసిన మంత్రి దుర్గేష్‌కు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గ్రామ జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే వేదికలని అన్నారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.

అలాగే కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

జాతర ప్రాంగణానికి భారీగా తరలివచ్చిన భక్తులు మంత్రి దుర్గేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు, ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.