
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. చండీగఢ్‌లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, రాజస్థాన్ బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. ఫాస్టెస్ట్ సెంచరీకి తృటిలో దూరమైనా, అతని దూకుడు రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించింది. ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది.
244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వికెట్లు తీసి హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా కొంతసేపు పోరాడినా, జట్టును గెలిపించలేకపోయారు.
చివరకు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19.2 ఓవర్లలో 196 పరుగుల వద్ద ముగిసింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు చేరుకోగా, ఈ నెల 29న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.