దేశ ప్రగతి ఎంత ముఖ్యమో… ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం: పవన్ కళ్యాణ్

అమరావతి: ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశ్రమల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే నిబంధనలను పట్టించుకోకుండా జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదని ఆయన అన్నారు.

పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సుప్రీం కోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన మార్గదర్శకాలను అన్ని పరిశ్రమలు, ప్రార్థనా మందిరాలు కూడా కచ్చితంగా అనుసరించాలని పేర్కొన్నారు. ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

జనావాసాలకు సమీపంలో మైనింగ్ పేలుళ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఇళ్లకు కలిగే నష్టం వంటి ఫిర్యాదులను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కాలుష్య నియంత్రణ తనిఖీల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండాలని, తనిఖీ బృందాల్లో బాధితులను కూడా భాగస్వామ్యం చేస్తే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద నమోదు చేసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యం వెదజల్లుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని ఆదేశించారు. సాంకేతికతను ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు దుర్వాసన తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.

గోస్తనీ నది తీవ్ర కాలుష్యానికి గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ, నీటి నమూనాల్లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రమాదకర స్థాయికి చేరినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి నదిలోకి వస్తున్న మురుగు, రసాయన వ్యర్థాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గాలి నాణ్యత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని, రాష్ట్రంలో కేటాయించిన నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై వచ్చిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి సంబంధిత ఫైల్‌ను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.