
- గొల్లపూడి ప్రధాన కార్యాలయంలో 22 ఆలయాల ఈవోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
- నూతన ఆర్జిత సేవలు, వేగవంతమైన డిజిటల్ సేవలకు శ్రీకారం
- నెల రోజుల్లోగా బయో గ్యాస్, పైప్డ్ గ్యాస్ ప్లాంట్లు, అన్ని ఆలయాల్లో రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్
- ఒక ఆలయంలోని ‘సక్సెస్ మంత్ర’ను అన్ని ఆలయాల్లోనూ వర్తింపజేయాలని సీఎం ఆదేశం
విజయవాడ: భారతదేశంలోనే ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్థానం కలిగిన ఆంధ్రప్రదేశ్ దేవాలయాలలో భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని దేవాదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం గొల్లపూడిలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్.జె.సి (ఆర్.జె.సి), డిప్యూటీ కమిషనర్ (డిసి) కేడర్‌కు చెందిన 22 ప్రధాన దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో (ఈ.ఓ.ఎస్) వివిధాంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.., భక్తులకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను పెద్ద ఎత్తున పెంపుదల చేయాలన్నారు. అలాగే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈవోలను ఆదేశించారు.
సమాజానికి దేవాలయాలు భారం కాకూడదు: కమిషనర్ కె. రామచంద్ర మోహన్
దేవాలయాలు సమాజ భారం మోసేలా ఉండాలే తప్ప, సమాజానికి భారం కాకూడదని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అన్నారు. ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆలయాల నుండి చెత్తను వేస్ట్ డంపింగ్ యార్డులకు పంపకుండా, ‘జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీ’ని పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజారోగ్యం, పారిశుధ్యం విషయంలో అన్ని ఆలయాల్లో అత్యంత మెరుగైన విధానాలు, పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ‘సక్సెస్ మంత్ర’ అమలు:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం… ఏదైనా ఒక ఆలయంలో అమలు చేస్తున్న మెరుగైన విధానాలు విజయవంతమైతే, అదే ‘సక్సెస్ మంత్ర’ను రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ విస్తరింపజేసి అమలు చేయాలని కమిషనర్ వివరించారు.
పర్యావరణ పరిరక్షణ – హరిత ఇంధనంపై కీలక ఆదేశాలు:
రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్: భూగర్భ జలాల పెంపునకు అన్ని ఆలయాలు ముందడుగు వేయాలని, భవనాలపై ‘రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్’ (వర్షపు నీటి సంరక్షణ) పద్ధతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
నీటి పునర్వినియోగం: ఆలయాలలో సూయజ్, సల్లేజ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నీటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తేవాలి.
బయో గ్యాస్&పైప్డ్ గ్యాస్: వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసేలా గోబర్ గ్యాస్, బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రాబోయే ఒక నెల రోజుల్లోగా అన్ని దేవాలయాల్లో పైప్డ్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలి.
సౌర విద్యుత్: సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ఆలయాల్లో సంప్రదాయేతర విద్యుత్ వనరులను ప్రోత్సహించాలని, ప్రకృతి ప్రసాదించిన శక్తులను గరిష్టంగా వినియోగించుకోవాలని కమిషనర్ రామచంద్ర మోహన్ కోరారు.
సేవకుల ప్రాధాన్యత:
దేవస్థానంలో ఉచిత సేవలందించే సేవకులే ఆలయాల ప్రచారకర్తలుగా బాధ్యతలు అప్పగించాలని, ఆన్ లైన్ సేవలు, సోషల్ మీడియా ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమముల వ్యాప్తి సేవకుల ద్వారా జరుగాలని కమిషనర్ ఆదేశించారు.
భక్తుల సేవే పరమావధిగా, పర్యావరణ అనుకూల హరిత ఆలయాలుగా ఆంధ్రప్రదేశ్ దేవాలయాలను తీర్చిదిద్దాలని కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు, 22 ప్రముఖ ఆలయాల ఈవోలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విజయవాడ, శ్రీ శైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీ కాళహస్తి, కాణిపాకం దేవాలయాల అధికారులు దేవాలయాల అభివృద్ధి పనులు పురోగతి గురించి వివరించారు.