చేపలకూర చేయించుకొని, మత్స్యకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం

కావలి నియోజకవర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు.

అనంతరం, మార్కెట్‌లో పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానంగారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక, సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి, తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.