వైసీపీ పాలనలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లింది

  1. ఇప్పుడు కపట ప్రేమ చూపించడం దారుణం
  2. వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు స్పందన

అమరావతి: రాష్ట్రంలో రైతుల సమస్యలు పడుతున్నారు అంటూ వైసిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి రైతాంగాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ నేతలు, ఇప్పుడు రైతుల పట్ల సానుభూతి మాటలు మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. రైతులకు సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందక ఇబ్బందులు ఎదురయ్యాయని, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారని గుర్తుచేశారు. రైతు భరోసా పేరుతో ప్రచారం చేసుకున్నా, వాస్తవంగా రైతుల జీవితాల్లో భరోసా లేకుండా చేశారని విమర్శించారు.

మామిడి రైతుల సమస్యలపై మాట్లాడే ముందు, వైసీపీ హయాంలో హార్టికల్చర్ రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎగుమతులు తగ్గి, మార్కెటింగ్ వ్యవస్థలు కూలిపోయి, రైతులు మధ్యవర్తుల చేతిలో దోపిడీకి గురైనప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా వైసీపీ పాలనలో అత్యంత దారుణంగా మారిందన్నారు. కనీస మద్దతు ధర అమలులో పూర్తిగా వైఫల్యం చెందారని, రైతులు రోడ్లపై ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతు సమస్యలపై స్పందించాల్సిన నాయకులు, అప్పట్లో కేవలం ప్రచార రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు.

వ్యవసాయ శాఖను వైసీపీ కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరం అని అచ్చెన్నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అంశాన్ని సమీక్షిస్తూ ముందుకెళ్తోందన్నారు. మామిడి రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు, కొనుగోలు కేంద్రాలు, ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు.

మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల పేరుతో డ్రామాలు చేయడం వైసీపీకి అలవాటైపోయిందని, కానీ ప్రజలు ఇప్పుడు వాస్తవాలను గుర్తిస్తున్నారని అన్నారు. రైతుల కోసం నిజంగా పనిచేయాలనే ఉద్దేశం ఉంటే చౌకబారు విమర్శలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కూటమి ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని, రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.