
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఒమన్ తీరంలో భారత సరుకు రవాణా నౌక ‘హాజీ అలీ’పై జరిగిన దాడి కలకలం రేపింది. గుజరాత్‌కు చెందిన ఈ నౌక సోమాలియా నుంచి యూఏఈలోని షార్జాకు పశువులను తరలిస్తుండగా బుధవారం తెల్లవారుజామున డ్రోన్ లేదా క్షిపణిగా అనుమానిస్తున్న పేలుడు వస్తువు ఢీకొట్టింది. దీంతో నౌకలో భారీ మంటలు చెలరేగి, అనంతరం సముద్రంలో మునిగిపోయింది.
ప్రమాదం సంభవించడంతో నౌకలోని 14 మంది భారత సిబ్బంది లైఫ్బోట్ల సహాయంతో సముద్రంలోకి దిగారు. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించి తీరానికి తరలించింది. ప్రస్తుతం సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. వాణిజ్య నౌకలపై దాడులు పూర్తిగా అంగీకారయోగ్యం కాదని పేర్కొంటూ ఘటనను ఖండించింది. భారత సిబ్బందిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
మరోవైపు, యూఏఈ తూర్పు తీరంలో లంగర్ వేసి ఉన్న మరో నౌకను గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు స్వాధీనం చేసుకుని ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. ఈ ఘటన హోర్ముజ్ జలసంధికి సమీపంలో జరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, రెండు భారత భారీ ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని గురువారం సురక్షితంగా దాటాయి. ‘సిమీ’, ‘ఎన్వీ సన్‌షైన్’ పేరుతో ఉన్న ఈ నౌకలు ఖతార్, యూఏఈ నుంచి ఎల్పీజీ సరుకుతో భారత్‌కు బయలుదేరాయి. ఇవి త్వరలో గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనున్నట్లు సమాచారం.