
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, చక్కెరకు ప్రత్యామ్నాయంగా పోషకాలతో నిండిన కొత్త ఉత్పత్తులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ క్రమంలో కోయంబత్తూరులోని ఐసీఏఆర్-చెరకు ప్రజనన సంస్థ (ఎస్బీఐ) ‘బెల్లం ద్రావణం’ లేదా ‘లిక్విడ్ జాగరీ’ను ప్రోత్సహిస్తోంది. ‘కాక్వి’గా పిలిచే ఈ ఉత్పత్తిని ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు లేకుండా తయారు చేయడం ప్రత్యేకత.
ఈ బెల్లం సిరప్‌లో పొటాషియం, మాంగనీస్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో, యాసిడిటీని నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ చక్కెరతో పోలిస్తే ఇది శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తుంది. అందువల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ప్రస్తుతం ఈ ఉత్పత్తికి కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ సాంకేతికతను కేరళకు చెందిన ఒక సంస్థకు లైసెన్స్ ఇవ్వగా, వారు 600 గ్రాముల బాటిల్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు. మిఠాయిల తయారీ, ఆయుర్వేద మందులు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ సలాడ్లు వంటి పలు ఆహార పదార్థాల్లో దీనిని వినియోగిస్తున్నారు.
ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలకు కేవలం రూ.10,000 రుసుముతో ఈ బెల్లం ద్రావణం తయారీ సాంకేతికతను బదిలీ చేసి శిక్షణ ఇవ్వడానికి సంస్థ సిద్ధంగా ఉంది. బెల్లం ద్రావణంతో పాటు చెరకు ఆధారిత కేన్ జామ్, డైటరీ ఫైబర్ ఆహార ఉత్పత్తులు, చెరకు రసం పొడి వంటి మరిన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను కూడా సంస్థ అభివృద్ధి చేస్తోంది.