హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సొంత స్థలం కలిగి అర్హత ఉన్న లబ్ధిదారులకు మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా, 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హైదరాబాద్‌కు 20–30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడం వల్ల పేదలకు సరైన ప్రయోజనం చేకూరలేదని మంత్రి అన్నారు. ఈసారి అలా కాకుండా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్కాజ్‌గిరి ప్రాంతంలోని యూఎల్‌సీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కూడా సమీక్షలో చర్చ జరిగింది. బాధ్యులైన రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.