
అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో శాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఆమె, ఖాళీ పోస్టుల భర్తీ నుంచి అత్యవసర స్పందన సమయాన్ని తగ్గించే వరకు పలు కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలోని 22 నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఫైర్ స్టేషన్లు లేకపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రతిపాదించిన ఐదు ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
శాఖలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని 1,275 ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్లో ఉన్న 305 పోస్టుల నియామక ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం 25 నుంచి 30 నిమిషాలుగా ఉన్న అత్యవసర స్పందన సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకాన్ని తప్పనిసరి చేయడంతో పాటు, లైసెన్సుల రెన్యువల్‌కు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయాలని సూచించారు.
అడవి మంటల నివారణ కోసం డ్రోన్ల వినియోగం పెంచాలని, పాఠశాలలు మరియు ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అలాగే సింగపూర్, స్విట్జర్లాండ్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో అమలవుతున్న విపత్తు నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు చేయదగిన అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.