
శస్త్రచికిత్స అనంతరం గత మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరిగి క్రియాశీలక విధుల్లోకి చేరనున్నారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో ఆయన హైదరాబాద్ నుంచి అమరావతి సమీపంలోని మంగళగిరిలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనబోతుండటంతో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరనున్న పవన్ కల్యాణ్, ఉదయం 10:40 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరికి ప్రయాణించి ఉదయం 11:30 గంటలకు క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి వరకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, అభిమానులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తిరిగి విధుల్లోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.