
మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజల సంతృప్తే అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొన్ని శాఖల్లో అధికారులు ప్రజల సంతృప్తి మేరకు పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అమరావతిలో జరిగిన సీఎం కాన్ఫరెన్స్లో పలు శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని వెల్లడైందన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మార్కాపురం జిల్లా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలిపారు.
ముఖ్యంగా ఐసిడిఎస్, ఆర్టీసీ, మున్సిపల్ శాఖల పనితీరు వెనుకబడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదని, ఈ కారణంగానే జిల్లా వెనుకబడుతోందని పేర్కొన్నారు.
ప్రతి బుధవారం, శనివారం జిల్లా అధికారులు ఫీల్డ్ విజిట్ నిర్వహించి ఫొటోలు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై అన్ని శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 183 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 118 కాగా, ఇతర సమస్యలకు సంబంధించినవి 65 ఉన్నాయని వెల్లడించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం మరియు కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, వెంకట శివరామిరెడ్డి, హౌసింగ్ పీడీ మోహన్రావు, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, డీఎల్డీఓ బాలు నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, డీఎస్ఓ అంకయ్య, జిల్లాలోని తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.