కార్మిక బిడ్డా… ఇది నీ అడ్డా!

• నిర్మాణ కూలీల కోసం ‘లేబర్ అడ్డా’లు
• కూటమి ప్రభుత్వ బృహత్తర పథకం
• దినసరి కూలీల ఉపాధికి ఊతం
• వేచి చూసే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు
• సంక్షేమ పథకాల సమాచారం
• అక్కడే ధరఖాస్తు చేసుకునే సదుపాయం
• నైపుణ్యాల వృద్ధికీ అవకాశం

పట్టణాల్లోని పలు కూడళ్లలో దినసరి కూలీలు, నిర్మాణ కార్మికులు గుమిగూడి ఉండడం సర్వసాధారణ విషయమే. ఆ రోజు ఉపాధి కోసం, పని కోసం వాళ్లంతా చేరతారు. పనులు కల్పించే కాంట్రాక్టర్లు, కూలీలు కావలసిన వారు అక్కడికి వచ్చి వారితో మాట్లాడి పనుల్లో కుదుర్చుకుంటారు. రెక్కడితే కానీ డొక్కాడని అలాంటి కూలీలు, కార్మికులకు గౌరవప్రదమైన వెసులుబాటు కలిగించడం కోసం, వాళ్లు వేచి చూసే స్థలాల్లో సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని అమలు చేయనుంది.
‘లేబర్ అడ్డాలు’ పేరుతో పట్టణాల్లో ఎక్కడెక్కడైతే కూలీలు, కార్మికులు గుమిగూడుతారో ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అడ్డాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు ఇవీ…
ప్రభుత్వ నూతన విధానం:
ప్రస్తుతం ఉన్న అసంఘటిత లేబర్ అడ్డాలను కేవలం పని దొరికే చోటుగానే కాకుండా, ‘స్కిల్ డెవలప్‌మెంట్ హబ్స్’ (నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు) గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
• మొదటి దశ: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలలో మొదటి విడతగా 15 లేబర్ అడ్డాలను అత్యాధునికంగా ఏర్పాటు చేయనున్నారు.
• నైపుణ్య శిక్షణ: పని లేని రోజుల్లో కూలీలు ఖాళీగా ఉండకుండా, అక్కడ కొత్త పనులు నేర్చుకోవడానికి లేదా ఉన్న నైపుణ్యాన్ని పెంచుకోవడానికి శిక్షణ ఇస్తారు.
• సదుపాయాలు: ఇక్కడ కూలీలకు తాగునీరు, నీడ, విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన కనీస సదుపాయాలను కల్పించనున్నారు.
ముఖ్యమైన లేబర్ అడ్డాల ప్రాంతాలు:
సాధారణంగా ప్రతి నగరంలోనూ కొన్ని ప్రధాన కూడళ్లు లేబర్ అడ్డాలుగా ప్రసిద్ధి చెందాయి….
• విజయవాడ: సింగ్ నగర్, పటమట, బెంజ్ సర్కిల్, విద్యాధరపురం వంటి ప్రాంతాలు.
• విశాఖపట్నం: కంచరపాలెం, గాజువాక, సీతమ్మధార.
• గుంటూరు: అమరావతి రోడ్, శంకర్ విలాస్ సెంటర్, లాడ్జ్ సెంటర్.
• ఇతర నగరాలు: రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన కేంద్రాల్లోని చౌరస్తాలు.
కూలీల సంక్షేమ పథకాలు… ప్రయోజనాలు:
కార్మికుల కోసం ప్రభుత్వం ప్రకటించిన తాజా సహాయక చర్యలు, పథకాల గురించి సమాచారాన్ని ఈ లేబర్ అడ్డాల కేంద్రాల్లో తెలుసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. ఆయా పథకాలలో నమోదు కావడానికి, ధరకాస్తు చేసుకోడానికి కూడా ఈ లేబర్ అడ్డా కేంద్రాల్లో ‘హెల్స్ డెస్క్’ లను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు ఈ కింది పథకాల సమాచారాన్ని కార్మికులు తెలుసుకోవడంతో పాటు, వాటి ప్రయోజనాలు పొందేందుకు తమ పేర్లను నమోదు చేసుకునే ఏర్పాట్లు ఉంటాయి.
• పెళ్లి కానుక: నిర్మాణ రంగ కార్మికులకు లేదా వారి కుమార్తెల వివాహానికి ₹25,000 ఆర్థిక సాయం.
• ప్రసవ సాయం: మహిళా కార్మికులకు ప్రసవ సమయంలో ₹20,000.
• బీమా సదుపాయం: ప్రమాదవశాత్తు మరణిస్తే పరిహారం.
• అంత్యక్రియలు: అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ₹20,000.
కార్మికులకు ఉపయోగపడే సమాచారం:
కార్మికులు తమ వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ పథకాలకు అర్హత పొందుతారు.
రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్మికులు గౌరవప్రదమైన వాతావరణంలో ఉండేలా… ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా 15 చోట్ల ప్రయోగాత్మకంగా సమీకృత కార్మిక సౌకర్యాల సముదాయాలైన ‘లేబర్‌ అడ్డా’లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడలో ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో అందుబాటులోకి తేనున్నారు. ఈ అడ్డాల్లో మరుగుదొడ్లు, టీవీలతో పాటు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే సదుపాయమూ ఉంది. పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ, మెప్మా, ఎంఎస్‌ఎంఈ, కార్మిక శాఖ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలు సంయుక్తంగా లేబర్‌ అడ్డాల్లో సేవలు అందిస్తాయి. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటాలు చేసి వారి పక్షపాతిగా ముద్ర పడ్డ విషయం అందరికీ తెలిసినదే. కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ మద్ధతు వారికి సంపూర్ణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వారికి అనుకూలమైన నిర్ణయాల వెనుక ఉప ముఖ్యమంత్రి సపోర్టు ఎంతో ఉందనేది కాదనలేని సత్యం.
– హెల్ప్‌ డెస్కులు
ప్రతి కార్మికుడినీ ప్రభుత్వ గుర్తింపు పరిధిలోకి తీసుకొచ్చేందుకు లేబర్‌ అడ్డాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికులు వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే సదుపాయమూ ఇక్కడ ఉంటుంది.
ఆధార్‌ అనుసంధానం, బ్యాంకు ఖాతాల ప్రారంభం లాంటి పనుల్లో ఇక్కడి సిబ్బంది సహాయం అందిస్తారు. దీంతో బీమా, పింఛను, సామాజిక భద్రతా పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కార్మికులు పొందొచ్చు.
కార్మికులకు ఐటీఐ, డిప్లొమా తత్సమాన అర్హతతో కూడిన నైపుణ్య శిక్షణ అందిస్తారు. ఈ అడ్డాలు వన్‌ స్టాప్‌ కేంద్రాలుగా పనిచేస్తాయి.
లేబర్‌ అడ్డాల్లో మంచినీరు, విశ్రాంతి గదులు, బయో మరుగుదొడ్లు, ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఈ కేంద్రాల్లోని సిబ్బందిని సంప్రదించి… కాంట్రాక్టర్లు, యజమానులు ముందస్తుగానే కార్మికులను బుక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల కార్మికులు పనులు దొరక్క వెనుదిరిగే పరిస్థితి ఉండదు.
– పని దొరకని రోజు నైపుణ్య శిక్షణ
కార్మికులకు పని దొరకని రోజున వారి సమయం వృథా కాకుండా నైపుణ్య శిక్షణ అందిస్తారు. వాహనాల్లో సమీపంలోని నిర్మాణ ప్రదేశాలకు తీసుకువెళ్తారు. అక్కడ వినియోగిస్తున్న ఆధునిక పద్ధతులపై శిక్షణిస్తారు. నిర్మాణ రంగం, దాని అనుబంధ విభాగాల్లో వచ్చిన కొత్త విధానాలు, పరికరాలపై అవగాహన కల్పిస్తారు.
నిర్మాణ రంగంలో కొత్తగా వచ్చిన పరికరాలు, పనుల్లో వచ్చిన మార్పులు, పని ప్రదేశాల్లో రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను లేబర్‌ అడ్డాల్లోని స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు.
అధునాతన టూల్‌ కిట్ల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. కార్మికులకు అన్నక్యాంటీన్‌ కూపన్లు అందిస్తారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌), మొబైల్‌ వైద్యసేవలు అందించే సంస్థల ద్వారా కార్మికులకు పరీక్షలు చేయిస్తారు. ఏ ప్రాంతంలోని కార్మికులకు ఎలాంటి అనారోగ్యాలు వస్తున్నాయో గుర్తిస్తారు. చికిత్సలు పొందేందుకు వైద్య, ఆరోగ్యశాఖతో అనుసంధానిస్తారు.
– పిల్లలకు చదువు, ఉపాధి భరోసా
కార్మికుల పిల్లల చదువు, ఉపాధి కల్పనకు ఈ కేంద్రాల్లో భరోసా కల్పిస్తారు. పిల్లలు చదువుకోవడానికి మార్గదర్శనం చేస్తారు. చదువు పూర్తయి ఖాళీగా ఉన్నవారి వివరాలను నైపుణ్యం పోర్టల్‌లో ఉంచుతారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించే శిక్షణలు, జాబ్‌ మేళాలకు పంపిస్తారు. వ్యాపారం చేయాలనుకుంటే శిక్షణ ఇప్పించడంతో పాటు రుణ సదుపాయం కల్పిస్తారు. కార్మికుల అడ్డాల్లో మెప్మా తరఫున ఒక రిసోర్స్‌ పర్సన్‌ ఉంటారు. కార్మికుల పిల్లల విద్యార్హతలు, ఇతరత్రా వివరాలను సేకరిస్తారు. వారి విద్యార్హతల ఆధారంగా ఉపాధి కల్పించడం, వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వ శాఖలతో అనుసంధానిస్తారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.