గిరిజనులకు సమాధానం చెప్పాకే బస్సు యాత్ర చేపట్టాలి: కొర్ర చందు నాయక్

తెలంగాణా/దేవరకొండ నియోజకవర్గం: గిరిజన స్వర్ణోత్సవాల బస్సు యాత్ర పేరుతో తండాల్లోకి వచ్చే ముందు గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, గిరిజన నాయకుడు కొర్ర చందు నాయక్ డిమాండ్ చేశారు.

దేవరకొండ పట్టణంలో బస్సు యాత్రను అడ్డుకునేందుకు హైదరాబాద్‌కు బయలుదేరిన చందు నాయక్‌ను పోలీసులు మార్గమధ్యలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి పేరుతో కార్యక్రమాలు నిర్వహించే ముందు ప్రభుత్వం బంజారా, గిరిజన సమాజానికి ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని అన్నారు.

బంజారా సమాజానికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, సేవాలాల్ కార్పొరేషన్ నిధులు ఎక్కడున్నాయని, 12 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే యువతకు స్వయం ఉపాధి రుణాలు, సబ్సిడీలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, గిరిజన విద్యార్థుల హాస్టళ్లు మరియు స్కాలర్‌షిప్‌ల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

సేవాలాల్ జయంతిని అధికారిక ప్రభుత్వ సెలవుగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించిన ఆయన, ఈ సమస్యలపై స్పష్టత ఇచ్చిన తర్వాతే బస్సు యాత్ర చేపట్టాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో గిరిజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల గిరిజన నాయకులతో కలిసి బస్సు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఎన్ని అరెస్టులు చేసినా భయపడబోమని, లంబాడ మరియు గిరిజన సమాజానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కొర్ర చందు నాయక్ స్పష్టం చేశారు. “జై సేవాలాల్.. జై జనసేన” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.