
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో “జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను” ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ కమిటీలను తన స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన ఆయన, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకుడు, పార్టీ పట్ల నిబద్ధతతో పాటు స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధక్స్, అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు సాధక్స్‌తో కలిసి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీల ద్వారా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారాన్ని సేకరించనున్నారు.
2014 నుంచి జనసేన జెండాను మోస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్లమెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారికి వారి సామర్థ్యం, ఆసక్తికి అనుగుణంగా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తన ఆధ్వర్యంలో తీసుకుంటామని స్పష్టం చేశారు. జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ వివరించారు.