ఎన్డీయే విజయంపై చంద్రబాబు స్పందన – అభివృద్ధిపైనే ప్రజల మద్దతు

అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రక విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి, ఆయన దార్శనికతకు ప్రతిబింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విజయం ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు మరింత బలాన్ని చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే స్ఫూర్తితో దేశ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తాజా ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయని ఆయన అన్నారు.

అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న నిబద్ధతకు ప్రజలు తమ మద్దతును స్పష్టంగా తెలియజేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన శక్తిగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ తీర్పుతో మరింత ఊపునిచ్చిందని వివరించారు. ఈ విజయం యావత్ దేశ ప్రజల విజయమని ఆయన కొనియాడారు.

ఇక ఈ ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశమని, నేటి యువత విశ్వసనీయత, అభివృద్ధి, నిజాయతీ పాలనకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విశ్లేషించారు. అభివృద్ధి అజెండాకే ప్రజలు పట్టం కడతారనే విషయం మరోసారి రుజువైందని తెలిపారు.

ఈ చారిత్రక విజయం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే విజయం సాధించిన అభ్యర్థులు, శ్రమించిన కార్యకర్తలు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.