ప్రకాశం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు జరుగుతున్న ప్రదేశాలపై పోలీసులు దృష్టి సారించారు. హోటళ్లు, డార్మెంటరీలు, టీ దుకాణాలు, బార్లు, హాస్టళ్లు, ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా గుంపులుగా ఉన్న చోట్ల మొబైల్ ఫోన్లు పరిశీలించి, బెట్టింగ్ యాప్‌ల వినియోగాన్ని గుర్తిస్తున్నారు.

బెట్టింగ్‌లో పాల్గొనడం మాత్రమే కాకుండా, ప్రోత్సహించడం లేదా మధ్యవర్తులుగా వ్యవహరించడం కూడా చట్టపరమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువత క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ మాయలో పడకుండా ఉండాలని పోలీసులు సూచించారు. చిన్న మొత్తాలతో ప్రారంభమయ్యే బెట్టింగ్ చివరికి ఆర్థికంగా తీవ్ర నష్టాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 112 లేదా 100కు కాల్ చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.