
తిరుపతి: జీవకోన పార్వతి నగర్‌లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జనసేన నాయకులు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం ప్రతి కార్యకర్త, నాయకుడి ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో జనసేన జెండాను ఎగురవేయాలని స్పష్టం చేశారు. కూటమి ధర్మానికి కట్టుబడి పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నాటికి ప్రతి డివిజన్‌లో పార్టీ మరింత బలంగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈసారి భారీ స్పందన లభిస్తోందని తెలిపారు. ఇంకా సభ్యత్వం తీసుకోని వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.