
రాజానగరం నియోజకవర్గానికి చెందిన పొగాకు రైతులు రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి రాజానగరం నియోజకవర్గంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర, పొగాకు కొనుగోళ్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే బత్తుల ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, పొగాకు రైతులకు అన్ని విధాలా న్యాయం చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చినందుకు రైతులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను శ్రద్ధగా విని అధికారులతో సమగ్రంగా చర్చించారని తెలిపారు. త్వరలోనే పొగాకు రైతుల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోళ్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అనంతరం పొగాకు రైతులు ఎమ్మెల్యే బత్తులకు దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.