
- అమరావతిని క్రియేటివ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక అడుగులు
- ముంబయి వేదికగా ఏపీ పర్యాటక ప్రగతిని చాటిచెప్పిన మంత్రి దుర్గేష్..అమరావతి కేవలం నగరం కాదు.. ఇదొక అంతర్జాతీయ క్రియేటివ్ హబ్ గా ప్రకటన
- అమరావతి, విశాఖ, తిరుపతి ప్రాంతాల అనుసంధానం చేస్తూ స్టోరీటెల్లింగ్ కారిడార్ కు చర్యలు
- హోలోగ్రాఫిక్ స్టోరీటెల్లింగ్ టెక్నాలజీతో ఏపీ సాంస్కృతిక వైభవం..సంప్రదాయ సందర్శన నుండి ‘ఎక్స్‌పీరియన్స్ ఎకానమీ’ వైపు ఏపీ పర్యాటకం అడుగులు
- పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్న డిజిటల్ మౌలిక వసతులు..స్పోర్ట్స్ టూరిజం వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు
ముంబయి/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక మరియు సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా(క్రియేటివ్ ఎకానమీ హబ్) తీర్చిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 8-9 తేదీల్లో జరుగుతోన్న 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా కు మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పులను ఆయన వివరించారు.
మంత్రి దుర్గేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం కంటెంట్, సంస్కృతి, జీవనశైలి మరియు ఇమ్మర్సివ్ డిజైన్‌ను పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో విలీనం చేయడంపై సృజనాత్మక మరియు అనుభవ ఆర్థిక వ్యవస్థకు చెందిన పలువురు వాటాదారులు అయిన జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్, ఆర్ ఎంజెడ్, అర్వాస్, తమరా లీజర్ ఎక్స్‌పీరియన్సెస్, షాలెట్ హోటల్స్ మరియు హవాస్ మీడియా సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపింది. పర్యాటక రంగాన్ని ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, క్రియేటివ్ ఎకనామీ హబ్ గా మార్చడమే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వారికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అమరావతిని కేవలం ఒక నగరంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి ‘క్రియేటివ్ ఎకానమీ హబ్ గా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచే ‘ఎక్స్ పీరియన్స్ ఎకానమీ’ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్, రెడ్ బుల్ వంటి దిగ్గజ సంస్థలతో కలసి పని చేయడం ద్వారా రాష్ట్రంలోని అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ ‘స్టోరీటెల్లింగ్ కారిడార్’ను అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. ఏపీ ఆధ్యాత్మికతను, సంస్కృతిని డిజిటల్ మాధ్యమాల్లో అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేయడానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు హోలోగ్రాఫిక్ స్టోరీటెల్లింగ్ మరియు ఇమ్మర్సివ్ కల్చరల్ నెరేటివ్స్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
రెడ్ బుల్ భాగస్వామ్యంతో క్రీడాకారుల జీవనశైలి, గమ్యస్థానాల ఆధారిత కథనాలను రూపొందించి ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ వేదికపై నిలబెడతామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కీలక చర్చలు జరిపిన మంత్రి దుర్గేష్ నెలరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి విశేష ప్రాధాన్యతనిస్తుందని, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పనతో పాటు నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు కల్పిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇప్పుడు సంప్రదాయ పద్ధతుల నుండి బయటపడి గ్లోబల్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఎదగడానికి సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు, సాంస్కృతిక కథనాలకు మరియు ఇమ్మర్సివ్ టూరిజం అనుభవాలకు ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. తద్వారా యువతకు ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధితో పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడమే తమ లక్ష్యమని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ క్రియేటివ్ ఎకానమీ విభాగపు లీడ్ సత్య ప్రభ, సీనియర్ కన్సల్టెంట్ సాహితీ దివి పాల్గొన్నారు.