స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వాలి: గాదె

అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం అమరావతి రోడ్డులోని ఏ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 2024 ఎన్నికల తర్వాత జిల్లాలోని రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తూ, కూటమిలో జనసేన పాత్రపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి వ్యూహరచన చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో మండల, డివిజన్ నాయకుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సరైన అభ్యర్థుల ఎంపికతోనే విజయం సాధ్యమని, స్థానిక నాయకులు ప్రజలతో అనుసంధానం పెంచుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లాలో ప్రతి స్థానంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యమి సభ్యత్వ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు చందు సాంబశివరావు మాట్లాడుతూ, రాజకీయాలు సుదీర్ఘ ప్రయాణమని, క్రమబద్ధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్ మరియు ఇతర నాయకులు పార్టీ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

సమావేశంలో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా సమర్థిస్తూ తీర్మానం ఆమోదించారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమం అనంతరం నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన ఘంటసాల కృష్ణ కౌండిన్యకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.