
పాలకొండ: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన సందర్భంగా పాలకొండ నియోజకవర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధిలోని దుర్గ గుడి నుండి యాలం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొని ప్రజలతో కలిసి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న ఈ రాజధానికి చట్టబద్ధత లభించడం అభివృద్ధి దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంలో అమరావతి ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. “అమరావతి మా హక్కు – అభివృద్ధి మా లక్ష్యం” అంటూ నినాదాలు చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.